Wednesday, January 22, 2014

ANR - Actor Never Retires (from our hearts)


            తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో విభిన్న చిత్రాలకు నాంది పలికిన నటుడు..... ఎన్నో అద్భుతమైన చిత్రాలను వెండి తెర పైకి తెప్పించిన వ్యక్తి..... "ఆడపిల్ల గొంతు, గొప్ప అందగాడేమీ కాదు, ఆహార్యము గొప్పగా లేదు, యన్.టీ.ఆర్.  లాంటి అందగాడు కాదు, యస్వీ.ఆర్ లాంటి సంభాషణ చాతుర్యం లేదు" అని అందరూ అనుకున్నారు.

               మాయాబజార్ చిత్రం లో మహామహుల మధ్య అభిమన్యుడిగా నటించి, మెప్పించి నటన అనే పద్మవ్యుహాన్ని చేధించారు. మిస్సమ్మ లో రేలంగి, పేకేటి రంగ లాంటి హాస్యాన్ని అవలీలగా పండించగల నటులున్నపటికి అయన కనపడగానే ప్రేక్షకులందరూ నవుతూనే ఉంటారు..... పౌరాణికాల్లో రామారావు గారు తన ప్రతిభ చాటుకుంటే, సాంఘిక చిత్రాల్లో నాగేశ్వరరావు గారు తనకు వడ్డించిన విస్తరి అన్నట్టుగా నటించి మెప్పించారు.... అంతటి తో ఆగకుండా "కీలు గుర్రం, సువర్ణసుందరి, చెంచు లక్ష్మి" లాంటి జానపదాల్లో కూడా నటించి మెప్పించి "హిట్టిచ్చారు"...... స్వతహాగా నాస్తికుడైనప్పటికీ, "విప్రనారాయణ, భక్త తుకారాం, భక్త జయదేవ, శ్రీ రామదాసు" లాంటి భక్తి రస చిత్రాల్లో భక్తుని పాత్రను ఇంతకన్నా గొప్పగా తెలుగు చలన  చిత్ర చరిత్రలో ఇంకెవరూ నటించాలేరని నిరూపించారు.... "మహా కవి కాళిదాసు, మహాకవి క్షేత్రయ, తెనాలి రామకృష్ణ,, అనార్కలి" లాంటి   చారిత్రక చిత్రాల్లో కూడా తన విశిష్ట నటన చాతుర్యాన్ని చాటి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు....... కథానాయకుడు చనిపోతే చిత్రాలు అడవేమో అనే అపోహను  "దేవదాసు, ప్రేమాభిషేకం" లాంటి సూపర్, డూపర్ హిట్లను అందించి పటాపంచలు చేసారు........ "సూత్రధారులు, ప్రాణ దాత, సీతారామయ్య గారి మనవరాలు" లాంటి చిత్రాల్లో తనకు తానే సాటే అన్నంత గొప్పగా మనల్ని అలరించారు........


                 దొంగరాముడు చిత్రాన్ని తన స్వసంస్థ "అన్నపూర్ణ స్టూడియోస్" ద్వారా నిర్మించి, తన సంస్థ విభిన్న చిత్రాలను  భవిష్యత్తు లో ప్రోత్సహిస్తూ, నిర్మిస్తుందని పునాది వేసిన స్ఫురద్రూపి...... ఏ వార్తా పత్రిక చదివినా 'డబ్బుల కోసం రక్త సంబంధం చూడకుండా చంపుకునే వాళ్ళను, కనీసం పసివాళ్ళని కూడా చూడకుండా పిల్లల జీవితాలను త్రుంచేసే' కిరాతకుల కథలు..... అది చదివి "ఔరా ఏమిటీ దారుణం" అనుకుంటున్నాము.... యువతరం చెడు మార్గాలు త్రొక్కడం వలన ఎదుర్కునే పరిణామాలను ప్రతిబింబిస్తూ తన సంస్థ ద్వారా నిర్మించి నటించిన రెండవ చిత్రం "సుడిగుండాలు"..... రెండవ చిత్రంగా ఇలాంటి కథను ఎంచుకున్న అయన తెగింపుకీ, అభిరుచికీ ఆశ్చర్యపోలేమంటే అది అతిశయోక్తి కాదు.......  ఇప్పుడే కాదు, ఎప్పటినుండో  అప్పటి ప్రేక్షకుల పరిపక్వతకంటే ముందుగా అలోచింపజేసే సినిమాలు ఆర్ధికంగా నిర్మాతకి నిరాశ మిగిల్చాయి.....  అయినా సరే మంచి కథలను తెరకెక్కించాలనే  తపనకి ప్రతీక "మరో ప్రపంచం"..... అన్నపూర్ణ సంస్థ నుండి వచ్చిన మూడవ చిత్రం.  ఇప్పటి తరం వారందరం "తెలుగులో శంకర్ లాంటి దర్శకుడు లేడు" అని ఎంతో బాధ పడుతున్నాం..... నన్నడిగితే "మరో ప్రపంచం" చూడండి అని చెప్తాను..... సమాజంలో ఉన్న అవినీతిని, అసమానతలను రూపుమాపటానికి శంకర్ ఉపయోగించుకున్న అస్త్రం నాయకుడు ప్రతినాయకులను చంపడమే..... "మరో ప్రపంచం" చిత్రం వీక్షించిన మనమే కాదు శంకర్ కూడా "సమాజాన్ని ఇలా కూడా ఉద్ధరించవచ్చు కదా?" అని అనుకుంటారన్నది అవాస్తవం కాదు. ఈ సంస్థ ద్వారా ఎన్నో విభిన్నమైన చిత్రాలు నిర్మింపబడ్డాయి, తెలుగు చలన చిత్ర సీమకు   ఎందరో దర్శకులూ నిర్మింపబడ్డారు .... తెలుగు వారికందరికీ గర్వకారణం "రామ్ గోపాల్ వర్మ" కూడా ఈ సంస్థ నుండి వచ్చిన క్షిపణే.......


                రామారావు, కృష్ణ, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, రాజేంద్ర ప్రసాద్ నుండి సిద్దార్థ్ వరకూ "మల్టీ స్టారర్ అంటే సమవుజ్జీ నటులే కాదు, ప్రతీ తరం లోని స్టార్ హీరోలతో కలిసి నటించడం అనే దానికి తార్కాణం "నాగేశ్వర రావు గారు".

                 ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో సినిమాల్లోకి రావలనుకుని హైదరాబాదు కి ట్రైన్, బస్, విమానం ఎక్కి వస్తున్న ప్రతీ ఒక్కరూ సర్వదా ఎవరికి ఋణపడి ఉండాలంటే అది నాగేశ్వరరావు గారికి...... చిత్రసీమ మద్రాస్ (ఇప్పటి చెన్నై) లో ఉండగా, ఇక్కడ తన సంస్థ ని నెలకొల్పి హైదరాబాదులో షూటింగ్ పెట్టుకుంటే గానీ తాను నటించనని ఖచ్చితంగా తేల్చి చెప్పి పరిశ్రమ ఇక్కడికి తరలి వచ్చేలా చేసిన మహా శక్తి . మనకి ఇంత చేసిన సమాజానికి ఏదో ఒకటి చేయాలని,  ఓ సంస్థ స్థాపించి ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలను చేపట్టారు. అయన పాఠశాల కి వెళ్ళి చదువుకోకపోయినా, జీవితమనే పాఠశాలలో డాక్టరేట్ సంపాదించుకున్న పట్టభద్రుడు..... దాదా సాహెబ్ ఫాల్కే, పద్మభూషణ్ లాంటి బిరుదులాంకితుడు.


               తెలుగు సినిమాల్లో హిరో చివర్లో బ్రతుకుతాడు.... అలానే ఆయనకూడా నిండు నూరేళ్ళు బ్రతుకుతారని ఆశించిన ఎందరో అభిమానులను , తన కుటుంబ సభ్యులను, తెలుగు సినీ అభిమానులను శోక సంద్రంలో ముంచి పరలోకానికి పయనించిన "బహుదూరపు బాటసారి".  మొన్న అంజలీ దేవి గారు కన్ను ముసారు..... "అనార్కలి" వెడలి పోయిన కొన్ని రోజుల్లో "సలీం" కూడా వెళ్ళిపోయాడు.

             తెలుగు చలనచిత్ర పరిశ్రమకు రామరావు గారు, నాగేశ్వరరావు గారు  రెండు కళ్ళని అంటారు.... ఏ.ఎన్.ఆర్ గారి విద్కోలతో రెండు కళ్ళను పోగొట్టుకున్న మన చిత్ర సీమ నిజంగానే అంధకారంలో మునిగిపోయింది...

                 మనం చివరిగా ఆ మహా వ్యక్తిని "మనం" లో చూసి ఆనందించాలి.... తన తుది శ్వాస వరకూ కేవలం  సినిమా కోసమే జివించారు.

         
ఒక శకం ముగిసిపోయింది.... నైతికంగా, కళాత్మకంగా వారు మొదలు పెట్టిన శకాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాల్సిన బాధ్యత మనందిరి మీద ఉంది...... ఇప్పుడు మనందరి బాధ్యత మరింత పెరిగింది...... తెలుగు కళామ్మ తల్లి బిడ్డల్లా వారు కలలు గన్న తెలుగు చిత్ర సీమ కీర్తి పతాకాలను ప్రపంచ స్థాయిలో ఎగురవేసి ఇలాంటి మహానుభావులందరికీ అంకితమిద్దాము....
                           
   
                                                       ------------జై హింద్-------------

2 comments: